![]() |
![]() |
.webp)
చాలామంది జీవితాల్లో పెంపుడు శునకాలతో ఒక విడదీయరాని బంధం ఉంటుంది. బుల్లితెర నటి శ్రీ సత్య లైఫ్ లో కూడా అలాంటి ఒక చిన్న పెంపుడు కుక్క ఉంది. దాని పేరు సోను. దాని మరణం శ్రీసత్యని కలిచివేసింది. దాంతో ఒక లేఖ రాసుకుంది. నా ప్రియమైన చిన్నారి, నీ కోసం నేను ఈ మాటలు రాస్తున్నానంటే నా మనసు ఇప్పటికీ నమ్మలేకపోతోంది. నువ్వు నా వైపు నడుచుకుంటూ రావడం, ఆ అమాయకపు కళ్లతో నన్ను చూడటం, మళ్ళీ మళ్ళీ నా ప్రేమను కోరడం . నేను నీ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను. నువ్వు వెళ్లిపోయాక నా జీవితంలో ఏర్పడిన ఆ ఖాళీని, ఆ నిశ్శబ్దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ నిశ్శబ్దం నేను ఎప్పుడూ విన్న ఏ శబ్దం కంటే ఎక్కువగా నా హృదయాన్ని బాధిస్తోంది. చాలామంది "అది ఒక కుక్క మాత్రమే కదా" అని అనవచ్చు.

కానీ వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం ఏమిటంటే, నువ్వు నాకు ఎప్పుడూ కేవలం ఒక పెంపుడు జంతువు కాదు. నువ్వు నా కుటుంబం. అంతకంటే ఎక్కువగా, నువ్వు నా కూతురివి.నిద్రలేవగానే నా మొదటి ఆలోచన నువ్వే, పడుకునే ముందు నా చివరి శ్రద్ధ కూడా నీ మీదే ఉండేది. నీ చిన్న చిన్న అవసరాలు, నీ సంతోషం, నీ ఆలింగనాలు, నీ ముద్దులు, నీ ఉనికి చుట్టూనే నా రోజులు గడిచేవి. మనుషులు జీవితాంతం వెతికినా దొరకని ప్రేమను నువ్వు నాకు ప్రతిరోజూ ఐదేళ్లపాటు, ఇచ్చావు.
స్వచ్ఛమైన, అమాయకమైన, ఎలాంటి షరతులు లేని ప్రేమ అది. నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో ఉన్నావు, నా కష్టకాలంలోనూ తోడుగా నిలిచావు, చివరికి నన్ను నేను ప్రేమించుకోలేని రోజుల్లో కూడా నన్ను ప్రేమించావు.ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నువ్వు నా కోసం ఎదురుచూసే నువ్వు కనిపించకపోతే ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు . నీకు ఇష్టమైన ప్రదేశం, నీ బొమ్మలు, నీ పడక... వాటిని చూస్తుంటే నా కన్నీళ్లు ఆగట్లేదు. ఈ ఇంట్లోని ప్రతి వస్తువులోనూ నీ జ్ఞాపకం ఏదో ఒకటి దాగి ఉంది.నీతో గడపడానికి నాకు ఇంకాస్త సమయం దొరికి ఉంటే బాగుండేదనిపిస్తూ ఉంటుంది. మరో రోజు, మరో కౌగిలింత, మరో ముద్దు, నువ్వు నాకెంత ముఖ్యమో చెప్పడానికి మరో క్షణం... ఇలాంటివి మళ్ళీ దొరికితే ఎంత బాగుంటుందో అని కోరుకుంటూనే ఉంటాను.
నిన్ను కంటికి రెప్పలా చూసుకునే అమ్మగా నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి సంతోషకరమైన క్షణానికి, ప్రతి నవ్వుకు, నిన్ను ప్రత్యేకంగా నిలిపిన ప్రతి చిన్న అలవాటుకూ ధన్యవాదాలు. నువ్వు నాకు ఓదార్పువి, సంతోషం, నీడ నాకు తెలిసిన అత్యంత స్వచ్ఛమైన ప్రేమవి. నువ్వు వెళ్ళిపోయిన రోజే నా హృదయంలో ఒక భాగం కూడా నీతో పాటే వెళ్లిపోయింది. కానీ నువ్వు నాకు పంచిన ప్రేమ మాత్రం నా జీవితాంతం నాతోనే ఉంటుంది. నా జీవితం మొత్తం నువ్వే కాకపోవచ్చు, కానీ నా జీవితాన్ని పరిపూర్ణం చేసింది మాత్రం నువ్వే. మళ్ళీ మనం కలుసుకునే వరకు... నా చిన్నారి తల్లి స్వేచ్ఛగా పరిగెత్తు, సంతోషంగా ఆడుకో. నీ అమ్మ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుందని గుర్తుంచుకో. " అంటూ శ్రీసత్య ఒక కన్నీటి లేఖను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ కూడా ఈ లేఖను చూసి రెస్పాండ్ అవుతున్నారు. శ్రీసత్య తన చూపుడు వేలు మీద సోను అంటూ పచ్చబొట్టు వేయించుకుంది తన పెంపుడు శునకాన్ని గుర్తుగా . గీతూ రాయల్, నైనికా, ప్రియాంక జైన్, యాంకర్ ధనుష్ వంటి వాళ్లంతా ఎమోషనల్ కామెంట్స్ పెట్టి వాళ్ళ బాధను వ్యక్తం చేశారు.
![]() |
![]() |